పిల్లలను వాతలు వచ్చేలా కొడ్తరా?..హెచ్ఎం తీరుపై తల్లిదండ్రుల ఆందోళన.. సత్తుపల్లి మండలంలో ఘటన

పిల్లలను వాతలు వచ్చేలా కొడ్తరా?..హెచ్ఎం తీరుపై తల్లిదండ్రుల ఆందోళన.. సత్తుపల్లి మండలంలో ఘటన

సత్తుపల్లి, వెలుగు: స్కూల్​ హెచ్​ఎం పిల్లలను వీపు వాచేలా ఈత కర్రతో కొట్టారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సత్తుపల్లి మండలంలోని రేజర్ల జడ్పీ హైస్కూల్​లో ఈ ఘటన జరిగింది. స్కూల్​ హెచ్​ఎం నాగమణి 20 మంది విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టారని పేరెంట్స్​ ఆరోపించారు.

మహాశివరాత్రి, కోలాట వేడుకల నేపథ్యంలో ఈ నెల 15, 16 తేదీల్లో విద్యార్థులు సెలవు పెట్టారు. మంగళవారం స్కూల్‌‌‌‌కు వచ్చిన వారిని అనుమతి లేకుండా సెలవు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తూ హెచ్‌‌‌‌ఎం ఈతకర్రతో కొట్టారని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో విషయం తెలుసుకున్న వారు స్కూల్​కు చేరుకుని హెచ్‌‌‌‌ఎంతో వాగ్వాదానికి దిగారు.

గ్రామంలోని ఇతర స్కూళ్లకు ఆప్షనల్​ హాలిడే ఇచ్చి, ఇక్కడ మాత్రం స్కూల్‌‌‌‌ తెరవడం సరైంది కాదని, గెజిటెడ్ సంతకాల విషయంలోనూ ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. హెచ్‌‌‌‌ఎం నాగమణి ఉంటే తమ పిల్లలను స్కూల్‌‌‌‌కు పంపబోమని స్పష్టం చేశారు. ఆందోళన సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇన్‌‌‌‌చార్జ్ తహసీల్దార్​ లక్ష్మి స్కూల్​ను సందర్శించి విచారణ చేపట్టారు. ఘటనపై నివేదికను ఉన్నతాధికారులకు పంపించి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.